మంత్రి పదవికి ఆ నియోజకవర్గం సెంటిమెంట్‌గా నిలుస్తోంది. అక్కడ గెలిచారంటే అమాత్యా అనిపించుకోవాల్సిందే. అంతలా ముద్రపడిన సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన మర్రి చెన్నారెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్‌రావు, మర్రి శశిధర్‌రెడ్డి, తలసాని మంత్రులయ్యారు. 1978లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించాయి. 2014లో టీడీపీ తరఫున, 2018లో టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన తలసాని ముచ్చటగా మూడోసారి గెలవాలని ఆరాటపడుతున్నారు. తలసాని జోరుకు అడ్డు పుల్ల వేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ చెమటోడుస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటను కాపాడతానని ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉంటె, సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నాలుగోరోజు ఆదివారం సనత్ నగర్ డివిజన్లో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఏ ఇంటికెళ్లినా శ్రీనన్న మీకే మా ఓటు అంటూ ప్రకటిస్తున్నారు. అనేక అభివృద్ధి పనులు చేసి మా సమస్యలు పరిష్కరించిన మిమ్మల్ని ఈ సారి ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఎంతో అభిమానంతో మంత్రి చేతిలో చేయి కలిపి చెబుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలు సమస్యలతో సతమతమయ్యే వారని అన్నారు. 2014 తర్వాత ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి ఎన్నికై ముఖ్యమంత్రిగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి కూడా చేయలేని అభివృద్ధి పనులను తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని చెప్పారు.