తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి నారా చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

-

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సుమారు 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలు‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న బాబు.. జైలులో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. దసరా సందర్భంగా తెలుగు ప్రజలకు జైలు నుంచి బహిరంగ లేఖ రాశారు. ప్రజలు, టీడీపీ శ్రేణులకు ధైర్యం చెబుతూ ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు.

Exit polls say Chandrababu Naidu could win state battle but lose out on  national ambitions

నా ప్రియాతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ లేఖ ప్రారంభించారు.

నేను జైలులో లేను… ప్రజలందరి హృదయాల్లో ఉన్నాను, ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నాను, విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. “ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజాజీవితం కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగింది. అందుకు ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం. ఓటమి భయంతో నన్ను జైల్లో బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు. కానీ సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ, నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతను మాత్రం ఎప్పటికీ చెరిపివేయలేరు.

ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు, జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల నుంచి దూరం చేయలేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను.
ఈ దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమండ్రి మహానాడులో ప్రకటించాను. ఇప్పుడదే రాజమండ్రి జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలోనే బయటికి వచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తాను. స్వర్గీయ ఎన్టీఆర్ బిడ్డ, నా అర్ధాంగి భువనేశ్వరి గతంలో ఎప్పుడూ బయటికి రాలేదు. కానీ నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని ఆమెను కోరాను. అందుకు ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్ట్ తో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టేందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో మీ ముందుకు వస్తోంది. జనమే నా బలం, నా ధైర్యం.

 

దేశవిదేశాల్లో నాకోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నాకోసం మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం కావొచ్చేమో… కానీ అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటికి వస్తాను. అప్పటివరకు నియంత పాలనపై శాంతియుతంగా పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు… మంచి తాత్కాలికంగా ఓడినట్టు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుంది. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది” అంటూ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఇట్లు మీ నారా చంద్రబాబునాయుడు… స్నేహ బ్లాక్… రాజమండ్రి జైలు నుంచి అంటూ తన లేఖను ముగించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news