చైనాలో మరో ఇద్దరు మంత్రులపై వేటు.. డ్రాగన్ దేశంలో అసలేం జరుగుతోంది..?

-

చైనా అధ్యక్షునిగా జిన్‌పింగ్‌ మూడోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటినుంచి చాలా మంది పారిశ్రామికవేత్తలు, మంత్రులు అదృశ్యమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విదేశాంగ మంత్రి కిన్ గాంగ్, రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్​ఫూ గత కొన్ని నెలలో నుంచి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత వారిని పదవి నుంచి తప్పించి మరొకరిని ఆ స్థానంలో నియమించింది జిన్​పింగ్ సర్కార్. జిన్​పింగ్ తన పాలనలో అధికారుల అవినీతిని సహించరనే వాదన ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇలా మంత్రుల అదృశ్యం మరింత కలవరపెడుతోంది.

అయితే రెండునెలలుగా కనిపించకుండాపోయిన రక్షణ శాఖ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫూపై వేటు వేసిన చైనా.. 24 గంటలు కూడా తిరగకముందే మరో ఇద్దరు మంత్రులను తొలగించింది. ఆర్థిక శాఖ మంత్రి లియు కున్‌, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వాంగ్‌ జిగాంగ్‌లను జిన్​పింగ్ సర్కార్ తమ పదవుల నుంచి తప్పించింది. దీనికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. లియు కున్‌ స్థానంలో లాన్‌ ఫోవాన్‌, జిగాంగ్‌ స్థానంలో యిన్‌ హెజున్‌లకు బాధ్యతలు అప్పగించినట్లు  తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news