నేటి నుంచి బీఆర్ఎస్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. రేపు పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. నేటి నుంచి నవంబరు 9 వరకు 35 సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 100 నియోజకవర్గాల్లో ప్రచారం లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్… రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
రెండో విడతలో రోజుకు దాదాపు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభలు నిర్వహించి.. శుక్రవారం పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో..శనివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో పాల్గొంటారు. ఈనెల 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, 31న హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రజాశీర్వాద సభలు జరగనున్నాయి. నవంబరు 1న సత్తుపల్లి, ఇల్లందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, 3న భైంసా, ఆర్మూర్, కోరుట్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. నవంబరు 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7వ తేదీన చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సీఎం.. ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజున కామారెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.