దేశంలో మళ్లీ ఉల్లి ధరలు మంట పుట్టిస్తున్నాయి. దేశ రాజధాని సహా కొన్ని రాష్ట్రాల్లో కేజీ 70 రూపాయలకు చేరాయి. దసరా నవరాత్రులకు ముందు వరకూ కేజీ 30రూపాయల ధరలో లభించిన ఉల్లిపాయలు.. ఇప్పుడు 60 నుంచి 70 వరకూ పెరిగాయని దిల్లీలో వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడం వల్లే ఉల్లి ధర పెరిగిందని వెల్లడించారు. ఉల్లిపాయలను అధికంగా పండించే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి సరఫరా ఆలస్యం కావడం వల్లే… ధరలు పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు.
డిమాండ్‌కు సరిపడగా ఉల్లి రాకుంటే దిల్లీలో కేజీ ధర 100 రూపాయల వరకూ పెరగవచ్చని గాజీపూర్ మార్కెట్‌కు చెందిన ఒక వ్యాపారి చెప్పారు. కొన్ని రోజుల క్రితం కేజీ 20 రూపాయలకు దొరికిన ఉల్లిపాయలు.. ఇప్పుడు 60 పెడితేగానీ దొరకడంలేదని.. వినియోగదారులు వాపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లోనూ ఉల్లి ధరలు అమాంతం పెరిగాయని… వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దిల్లీలో టమాటా ధరలు కూడా పెరిగినట్లు అక్కడి వ్యాపారులు చెప్పారు. కొన్నిరోజుల క్రితం వరకూ కిలో 20రూపాయలు పలికిన టమాటాకు..ఇప్పుడు కేజీ 45 రూపాయలు చెల్లించాల్సి వస్తోందని…. ఒక వ్యాపారి చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టామాట ధర కిలో 70 రూపాయలకు పెరుగుతుందని అన్నారు.