రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని కేంద్రం పేర్కొంది. రాజకీయ పార్టీలకు స్వచ్ఛమైన ధనం విరాళంగా అందించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం తీసుకొచ్చామని తెలిపింది. విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. ఈ పథకంతో విరాళాలు ఇచ్చే వారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని… స్వచ్ఛమైన మార్గాల్లో డబ్బును సమకూర్చుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని అటార్నీ జనరల్ తెలిపారు.
కేంద్రం వాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విమర్శలు గుప్పించారు. ఎన్నికల బాండ్ల కేసులో భాజపా తన ఉద్దేశాలను స్పష్టం చేసిందని….బడా కార్పొరేట్ల నుంచి భాజపా రహస్యంగా, కుట్రపూరితంగా విరాళాలను సేకరిస్తోందని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబరు 31న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ చేపట్టనుంది…