కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ తరహాలో ఒకేసారి నియోజకవర్గం మొత్తానికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దళితబంధు తీసుకురావాలని ఎవరూ నన్ను అడుగలేదు. దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడి పెట్టాను. ఈ సభతో ఈశ్వర్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది.. గెలిచిపోయిండని తెలిసిపోయింది. నేను మీ అందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా. కొప్పుల ఈశ్వర్ 70-80వేల ఓట్ల మెజారిటీతో గెలవాలి. ధర్మపురి నియోజకవర్గం మొత్తానికి హుజూరాబాద్‌లో మాదిరిగా ఒకేసారి దళితబంధు పథకాన్ని మంజూరు చేయిస్తా. ప్రతి ఇంటికి కూడా దళితబంధు పథకం వస్తుంది’ అని వెల్లడించారు.
దళితబంధు ఎందుకు తీసుకువచ్చాం. తిన్నది అరగకనా? రైతుబంధుతో ఎట్లయితే రైతులను ఆదుకుంటున్నమో దళితబిడ్డలు, సమాజం దగా చేయబడ్డది. తరతరాల నుంచి దోపిడీకి గురైంది. అణచివేయిబడ్డది. ఆ సమాజం అలా ఉండడం మనందరికీ సిగ్గుచేటు. వాళ్లు కూడా సాటి మనుషులే. వారిని ఎట్టి పరిస్థితుల్లో పైకి తేవాలని.. సమాజం బాగుపడాలని స్వయంగా ఆలోచించి తీసుకువచ్చిన పథకమే దళితబంధు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా దళితబంధు గురించి ఆలోచన చేయాలి. దళితులను ఓటుబ్యాంకు వాడుకున్నారు తప్ప.. ఎన్నడూ చేసిన పాపానపోలేదన్నారు సీఎం కేసీఆర్.