రెండేళ్ల జైలు, రూ. 2 లక్షలు.. ఇసుక పై జగన్ బ్రహ్మాస్త్రం..!

-

ఇసుక సమస్య పరిష్కారంపై ఏపీ సీఎం జగన్ దృష్టి సారించారు. ఇసుక అక్రమంగా నిల్వ ఉంచే వారిపై, ఇసుక అక్రమంగా రవాణా చేసేవారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులకు జైలు, జరిమానా విధించేలా చట్టసవరణకు అనుమతించింది.

ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్, పునర్వివిక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇసుక విధానాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆంధ్రప్రదేశ్‌ గనులచట్టంలో సవరణలకు ఆమోదం తెలిపింది. నవంబర్ 14 నుంచి జరిగే వారోత్సవాల్లో ఇసుక లభ్యతను మరింత పెంచాలని నిర్ణయించింది.

రోజుకు 2 లక్షల టన్నుల వరకూ ఇసుక అందుబాటులో ఉంచడం ద్వారా వచ్చే 10 రోజుల్లో ఇప్పటివరకూ ఉన్న కొరతను పూర్తిగా తీర్చాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రాన్ని కాలుష్యం నుంచి రక్షించడానికి ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజిమెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. పారిశ్రామిక వ్యర్ధాలతో పాటు ఇతర వ్యర్ధాల సేకరణ, రవాణా, నిల్వ, శుద్ది నిర్వహణపై ఈ సంస్థ పని చేస్తుంది. రాష్ట్రంలోని 9వేల పరిశ్రమల్లో 2వేల పరిశ్రమలు రెడ్‌ కేటగిరీలో ఉన్నట్లు కేబినెట్ అభిప్రాయపడింది.

వ్యర్థాలను, కలుషిత జలాలను శుద్ధిచేసేందుకు తగిన వ్యవస్థ అవసరమని గుర్తించింది. మొత్తానికి ఈ కొత్త చట్టాలతో ఏపీలో పర్యావరణానికి మేలు జరిగే అవకాశం ఉంది. వరదలు తగ్గుతుండటం వల్ల ఇసుక సమస్య కూడా త్వరలోనే కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news