నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల కమిషనర్గా పని చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎట్టకేలకు తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆయన ఓటు హక్కును పొందారు. సొంతూర్లో ఓటు హక్కును పొందడం కోసం ఆయన హైకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సొంతూళ్లో తనకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ.. రమేశ్ కుమార్ గతంలో చీఫ్ ఎలక్టోరల్ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ ఊళ్లో నివాసం ఉండటం లేదనే కారణంతో దుగ్గిరాలలో ఓటు హక్కు కల్పించేందుకు నిరాకరించారు. దీంతో సొంతూరిలో ఓటు హక్కు కోసం ఆయన పోరాటం చేశారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు. తనకు దుగ్గిరాలలో ఇల్లు, ఆస్తులు ఉన్నాయని, తన తల్లి కూడా ఆ ఊళ్లోనే ఉంటున్నారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏడాది జులైలో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఓటు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆయనకు న్యాయస్థానం సూచించింది. ఆయన దరఖాస్తుపై నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. తాజాగా దుగ్గిరాలలోని ఓటర్ల జాబితాలో ఆయన వివరాలు కనిపించాయి.