దిల్లీలో వాయునాణ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. వరుసగా ఐదో రోజు తీవ్రమైన ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. దిల్లీలో ఆదివారం వాయునాణ్యత 410 పాయింట్లుగా నమోదు కాగా.. అది ఇవాళ 488కు చేరినట్లు అధికారులు తెలిపారు. కాలుష్య నియంత్రణ గురించి చర్చించేందుకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్.. అన్ని శాఖల అధికారులను అత్యవసర సమావేశానికి ఆహ్వానించారు. నాలుగో ప్రమాదక స్థాయిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నగరవ్యాప్తంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను కఠినంగా అమలు చేయాలని అధికారులను నిర్దేశించనున్నారు. నిత్యావసర, అత్యవసర సేవలు అందించే ట్రక్కులు మినహా.. మిగిలిన భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని ఇప్పటికే సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు దిల్లీ సహా.. ఎన్సీఆర్ ప్రాంతాలకు వర్తించనున్నాయి. విద్యార్థులకు భౌతికంగా పాఠశాలలకు హాజరు కావడాన్ని నిలిపివేశారు. ఇది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణాంతకం మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది.