తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీ వైఫల్యాలనే అస్త్రాలుగా మలుచుకుని ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. 50 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి చేసిందేం లేదని.. స్కామ్‌లు చేయడం తప్ప.. సంక్షేమం ఆ పార్టీకి పట్టదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విమర్శించారు.
సిద్దిపేటలో పర్యటించిన హరీశ్ రావు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలతో హస్తం పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ప్రజల మీద ప్రేమ తక్కువ.. అధికారం మీద యావ ఎక్కువ అని పేర్కొన్నారు. ఆ పార్టీకి అధికారం ఇస్తే 10 ఏళ్లు వెనక్కి పోతామని తెలిపారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
అంతకుముందు హరీశ్ రావు కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా బేగంపేట్ రహదారిపై హరీశ్ రావు కాన్వాయ్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలకు సహకరించినందుకు పోలీసులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.