మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత.. తన తండ్రి మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వారసురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మహిళా నేతల్లో ఎంపీ కవితకు చురుకైన నాయకురాలిగా గుర్తింపు ఉంది. అంతేగాకుండా కవితతో పోటీ పడే మహిళా నాయకులెవరూ అధికార టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల్లోనూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రజలతో ఇట్టే కలిసిపోయే ఆమె నైజం, అనతికాలంలోనే ఆమెను నాయకురాలిగా నిలబెట్టింది.
అయితే ఇటీవల ఎంపీ కవిత రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. డోర్నకల్ ని యోజకవర్గ రాజకీయ పరిస్థితులు పూర్తిగా ఆమెను అవస్థల పాలు చేస్తున్నాయని అంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న డీఎస్ రెడ్యానాయక్‌కు ఇదే నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్‌కు మధ్య ఉన్న రాజకీయ వైరం ఎంపీ కవితకు తలనొప్పిగా మారింది. నిజానికి ఎంపీ కవితకు, మంత్రి సత్యవతికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
రెడ్యానాయక్‌కు, సత్యవతి వియ్యంపురాలు వరుస అవుతుంది. ఇక సత్యవతి కవితకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు, కన్నతండ్రి రెడ్యాను కాదని మంత్రి సత్యవతితో సన్నిహితంగా ఉండలేకపోతున్నారు ఎంపీ కవిత. మంత్రితో కలిసిపోదాం అంటే.. కన్నతండ్రికి కోపం.. సత్యవతిని వదిలేసి ఉందామంటే అధిష్టానంతో భయం.. ఈ విపత్కర పరిస్థితి ఎంపీ మాలోత్ కవితకు తలనొప్పిగా మారిందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మిగతా నియోజకవర్గాల్లో అంతా తానై వ్యవహరించే ఎంపీ కవిత.. డోర్నకల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మాత్రం ఎవరితో ఉండాలో తెలియక ఇబ్బందిక, అయోమయ పరిస్థితి ఎదుర్కుంటున్నారు.
ఈ క్రమంలోనే డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతి పర్యటనలో కనిపించకుండా, మానుకోట నియోకవర్గంలోకి వచ్చిన తర్వాత ఆమెతో కలిసి పర్యటనలో పాల్గొనడం గమనార్హం. అటు రెడ్యానాయక్ తనకు మంత్రి పదవి రాకుండా… సత్యవతికి మంత్రి పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్న టాక్ ఉంది. దీనిపై ఆయన పలుసార్లు ఓపెన్‌గానే తన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు రెడ్యా వర్సెస్ సత్యవతి పోరులో కవిత వర్సెస్ సత్యవతి మధ్య కూడా తెలియని కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయ్యిందన్న చర్చలు వరంగల్‌లో వినిపిస్తున్నాయి.