ఏపీలోని విశాఖపట్నం నగరంలోని మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం వంటగ్యాస్ లీక్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మృతి చెందారు. అయితే ఈ నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలను వెల్లడించారు.
ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వై.బాలరాజు(60), అతడి భార్య చిన్ని(55), పెద్దకుమారుడు గిరి(22) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారని పోలీసులు తెలిపారు. వీరి చిన్న కుమారుడు కార్తిక్ (21) రెండు రోజుల క్రితమే మృతి చెందాడని వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పీఎం పాలెం పోలీసులు వెల్లడించారు.
ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చే క్రమంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో వాంబే కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.