మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది . ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ సరళిని చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ సత్తా చాటుతోంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, కాషాయ పార్టీ మధ్య హోరాహోరీ పోటీ తలపిస్తోంది.
మరోవైపు మధ్య ప్రదేశ్‌లో ఆధిక్యంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్(116)ను దాటింది. ప్రస్తుతం ఆ పార్టీ 144 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.కాంగ్రెస్ 58 చోట్ల.. ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు. మరోవైపు రాజస్థాన్‌లో బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. లీడింగ్‌లో ఉన్న స్థానాల సంఖ్య వంద దాటింది. కాంగ్రెస్ 60కి పైగా స్థానాలతో కొనసాగుతోంది. ఇతరులు సుమారు 20 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ఆధిక్యం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య దోబూచులాడుతోంది.