దేశంలో చాలా మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని.. ఒకే వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండటం అనైతికమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ప్రతినిధులు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓటు తొలగించేటప్పుడు సంబంధిత వ్యక్తికి నోటీసు ఇచ్చి.. వివరణ తీసుకోవాలని సూచించారు. పౌరుడు ఎన్నిక చేసుకున్న ప్రదేశంలోనే ఓటు హక్కు కల్పించాలని.. నివాసం లేనంత మాత్రాన ఓటు హక్కు తొలగించకూడదని అన్నారు. కేవలం బీఎల్వోల ఫిర్యాదు మేరకు ఓటు హక్కు తొలగిస్తున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరించారు.
మరోవైపు ప్రభుత్వ నిధులు పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం అనైతికమని నిమ్మగడ్డ అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వం, పార్టీ.. రెండూ సమాంతర వ్యవస్థలని.. ప్రభుత్వంపై పార్టీ ప్రభావం పడకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వనరులతో, ప్రభుత్వ సిబ్బందితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనైతికమని.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. ఇటీవల జారీ చేసిన జీవో నెం.7 ద్వారా పబ్లిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ దుర్వినియోగాన్ని ఆపాలని గవర్నర్ ను కోరినట్లు ఆయన చెప్పారు.