రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. యాసంగి రైతుబందును కాంగ్రెస్ చెప్పిన ప్రకారం విడుదల చేయాలని కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రజల ఆలోచన విధానాలకి అనుగుణంగా పనిచేసినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచనలను మార్చుకొని మార్పు కావాలని కోరుకున్నారన్నారు.
పట్టణ ప్రజలు మాత్రం అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కే ఓటు వేశారన్నారు. రూ.200 ఉన్న పింఛన్లు రూ.2000 చేయడంతో పాటు మేనిఫెస్టోలో పొందపరిచిన రూ. 3000 ప్రకారం పెన్షన్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడు అన్నారు. అయినా ప్రజలు తేల్చుకోలేని స్థితిలో ఉండి గ్రామాల్లో మార్పు కోరుకున్నారని పట్టణాలలో జరిగిన అభివృద్ధికి పట్టణ ప్రజలు టిఆర్ఎస్ కే ఓట్లు వేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు సాగు, తాగు నీరు, ఉచిత 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందించి అభివృద్ధి సంక్షేమం దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలిపింది అన్నారు.