మిగ్జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే తుపాను అల్పపీడనంగా మారడంతో పరిస్థితులు కాస్త శాంతించాయి. కానీ ఈ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి మాత్రం ఇంకా ఈ రాష్ట్రాలు సాధారణ స్థితికి చేరుకోలేకపోతున్నాయి. తమిళనాడులో వర్షం తగ్గినా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. చెన్నై గుబేరన్ నగర్ లోని మడిపాక్కం ప్రాంతంలో చాలా వరకు ఇళ్లు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.
పల్లికరణై ప్రాంతం చెరువును తలపిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. అక్కడ ఇళ్లు, పలు పెట్రోల్ పంపులు వరదలో చిక్కుకుని ఉన్నాయి. చెన్నైలోని జెరూసలేం ఇంజినీరింగ్ కళాశాల జల దిగ్బంధంలోనే ఉంది. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా జార విడుస్తున్నారు. మిగ్ జాం తుపాను ప్రభావంతో రెండు రోజుల కింద తమిళనాడులో భారీగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ వర్షాల వల్ల చెన్నైలో 12 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.