ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ (ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లలో 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు టీడీపీ నాయకుడు ఆనం వెంకట రమణారెడ్డి పూర్తి అధ్యయనం తర్వాత పేర్కొన్న విషయం తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు అన్నారు. రోడ్డు విస్తరణలో, ప్రభుత్వ కార్యక్రమాలను చేపట్టడానికి భూసేకరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను జారీ చేస్తారని తెలిపారు.
తణుకు, తాడేపల్లిగూడెంలలో కూడా ఈ విధంగా టీడిఆర్ బాండ్లను జారీ చేశారని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లలో జరిగిన అవినీతిపై పూర్తి అధ్యయనం చేసిన టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి గారు పత్రికా, మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ అక్రమాల గురించి వెల్లడించిన విషయం తెలిసిందేనని, టీడీఆర్ బాండ్లను జారీ చేయడం అంటే అక్రమ కట్టడాలను ప్రోత్సహించడమేనని అన్నారు. ఒక ప్రాంతంలో నాలుగు అంతస్తులకే అనుమతులు లభించనుండగా, టీడీఆర్ బాండ్లను కొనుగోలు చేసి అదనంగా రెండు అంతస్తులను కట్టుకునే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తోందని, అయితే ఈ టీడీఆర్ బాండ్లలో అవినీతికి ఎలా పాల్పడ్డారన్నదానిపై ఆరా తీయగా, పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.