ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బతికి ఉండగానే ఆయన తన సమాధి కట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పాస్ బుక్లో జగన్ ఫోటోలు ఎందుకన.. ఆయన శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా అంటూ ప్రశ్నించారు. ధరణి పేరుతో కేసీఅర్ చేసిన మోసాల కంటే జగన్ ఎక్కువ తప్పులు చేశారని విమర్శించారు. ప్రతి ఊళ్లో జగన్ సమాధి రాయి వేసుకున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు.
బీజేపీ తెలుగు ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉందన్న నారాయణ.. ఆ పార్టీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు వ్యతిరేకించే పార్టీతో సత్సంబంధాలు జగన్కు కీడు చేస్తాయని వ్యాఖ్యానించారు. మంచి నిర్ణయం తీసుకుంటే ఏపీలో కూడా అధికార మార్పిడి ఖాయమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏపీలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తామని నారాయణ వెల్లడించారు. మరోవైపు సీపీఐ ఓట్లు కలవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందని వెల్లడించారు.