రాష్ట్ర శాసనసభలో తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి శాసనసభాపక్షం స్పీకర్‌ను కోరింది. బుధవారం నుంచి తిరిగి సమావేశం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు గణాంకాలు పేర్కొనాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పే విషయాలకు ప్రధాన ప్రతిపక్షంగా తాము వివరణ ఇవ్వాల్సి ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బుధవారం రోజున చర్చ సందర్భంగా ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకూ అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ శాసనసభా పక్షం తరపున శాసనసభాపతి ప్రసాద్ కుమార్‌కు హరీశ్ రావు లేఖ రాశారు.