తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై 42 పేజీల నివేదిక విడుదల చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని పేర్కొన్నారు.శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదని, తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో హరీశ్ రావు వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం పూర్తిగా తెలుసుకున్న తర్వాత సభలో మాట్లాడాలని హితవు పలికారు. సత్యదూరమైన మాటలు చెప్పి సభను పక్కదారి పట్టించవద్దని సూచించారు.లెక్కల్లో తప్పొప్పులు ఉంటే ఆర్థిక శాఖ మంత్రి చెబుతారని తెలిపారు. నివేదిక ఎవరో తయారు చేశారనే మాటలు సరికాదని అన్నారు. హరీశ్ రావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.