తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పంట బీమా పథకాన్ని రైతు యూనిట్‌గా అమలు చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని, వీలైతే వచ్చే వానకాలం నుంచే అమలు చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే పంటల బీమా అమలులోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుందని, పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
2016–17 రబీ నుంచి కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభమైంది. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలని, దీంతో రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుందని స్పష్టం చేశారు.