BREAKING : మరోసారి వాయిదా పడ్డ గ్రూప్ 2 పరీక్ష

-

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న నిరుద్యోగులకు అడుగడుగునా నిరాశే ఎదురవుతోంది. ముఖ్యంగా గ్రూప్ 2 పరీక్ష అభ్యర్థులు పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అనే గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ పరీక్ష తాజాగా మరోసారి వాయిదా పడింది.

గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. జనవరి 6, 7వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రకటించింది. గ్రూప్-2 నియామక పరీక్ష కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని  వెల్లడించింది.

ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ మొదట సన్నాహాలు చేసింది.  అదే సమయంలో మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో నవంబరు 2, 3 తేదీలకు వాయిదా వేశారు. ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మళ్లీ వాయిదా పడింది. ఇక కొత్త సర్కార్ కొలువు తీరిన తర్వాత అయినా తమ రాత మారుతుంది అనుకున్న నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది.

Tspsc చైర్మన్, సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news