ఇల్లు కబ్జా ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ భార్య మనీలాల్ ఫిర్యాదు మేరకు ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూప డింపుల్, ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను నిందితులుగా చేర్చారు. 2014లో జూబ్లీహిల్స్ లోని నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేశాం. 2019లో అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత ఖాళీ చేయమన్నాం. రెంటల్ అగ్రిమెంట్ కు విరుద్ధంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.మా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారు అని గత నెల 17న మనీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేసిన పోలీసులు ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్ ను డిసెంబర్ 22న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ పరారీ లో ఉండగా.. బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని వివరిస్తున్నారు. నవీన్ కుమార్ టీఎస్ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇల్లు కబ్జా ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ స్పందించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇల్లు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. 2020 నుంచి వివాదం నడుస్తోంది. సివిల్ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్ పోలీసులు వివరాల కోసం పిలిచారు. నా దగ్గర ఉన్న సమాచారం ఇచ్చాను. లీగల్ గా ముందుకెళ్తా.. గురువారం అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.