మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చేతులెత్తేసింది. ఆ పనులకు సంబంధించిన నైపుణ్యం తమ వద్ద లేదని చెప్పింది. అత్యాధునిక సామర్థ్యం ఉన్న, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సంస్థలను ఎంపిక చేసి రక్షణకు సంబంధించిన డిజైన్లు తీసుకోండని స్పష్టం చేసింది. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్, డిజైన్, పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
నిర్మాణ సమయంలో ఇచ్చిన మోడల్ స్టడీస్‌కు, తర్వాత బ్యారేజీ నిర్వహణ తీరుకు పొంతన లేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని అభిప్రాయపడినట్లు సమాచారం. సాధరణంగా బ్యారేజీ నిర్వహణలో వరద తగ్గుముఖం పట్టినపుడు గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తారు. కానీ మేడిగడ్డలో గేట్లను పూర్తిగా మూసి నీటిమట్టం పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దీనివల్ల నీటి వేగంలో మార్పు వచ్చి దిగువ భాగంలో ఆప్రాన్(కాంక్రీటు నిర్మాణం) దాటి నీళ్లు పడటం వల్ల సమస్య వచ్చింది. మేం చేసిన డిజైన్‌కు, బ్యారేజీ నిర్వహణకు పొంతన లేకుండా పోయింది అని సీడీవో ఇంజినీర్లు ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లకు స్పష్టం చేసినట్లు సమాచారం.