తెలంగాణ సర్కార్ ఆరు గ్యారంటీల అమలు కోసం అభయహస్తం పేరిట ఏర్పాటు చేసిన దరఖాస్తు ఫారం ప్రక్రియ వెనక ఉన్న మతలబు అర్థం కావట్లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడజు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ దృక్పథంతోనే అభయ హస్తం ఫారం ఉందని విమర్శించారు. అభయహస్తం దరఖాస్తు ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేలా లేదని తెలిపారు. దరఖాస్తు అవసరం లేకుండా హామీలు నిలబెట్టుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి.. రేషన్ కార్డు లేకుండానే జత చేయాలని కాంగ్రెస్ చెబుతోందని అన్నారు. పథకాల అమలు జాప్యం చేసేందుకే కాంగ్రెస్ అభయహస్తం నాటకం ఆడుతోందని మండిపడ్డారు. అభయహస్తం దరఖాస్తు ఫారాలు ప్రజలను అయోమానికి గురి చేస్తున్నాయని తెలిపారు. ఈ దరఖాస్తులు బయట అమ్ముతున్నారని.. ఇది ఆరు గ్యారంటీల అమలు ఆలస్యం చేసే ప్రక్రియ అని విమర్శించారు. రేషన్‌కార్డు లేకుండా ఎలా పథకాలు ఇస్తారని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.