‘స్టాకర్‌వేర్‌’ అంటే తెలుసా?

-

భార్య లేదా భర్త మీద నిఘా వేయడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ‘స్టాకర్‌వేర్‌’ లేదా ‘స్పౌస్‌వేర్‌’ అంటారు. అన్నట్టు వీటిని విరివిగా వాడుతున్న దేశాలలో మనది రెండో స్థానం.

‘నిన్న నువ్వు సాయంత్రం ఏడు గంటలకు మీ ఫ్రెండ్‌ అనిత వాళ్లింట్లో లేవు. నీ కొలీగ్‌ శంకర్‌తో కాఫీ డేలో ఉన్నావు కదా. నాకెందుకు అబద్ధం చెప్పావు?’.. వింటున్న హేమ ఉలిక్కిపడింది.
‘మీకెలా తెలుసు?’
నేను కూడా ఆ టైమ్‌లో అక్కడే ఉన్నానులే..’
కావచ్చేమో అనుకుంది హేమ. మర్నాటి రాత్రి మంచంమీద ఉన్నప్పుడు, ఏదో అడిగితే, ‘మాకేం తెలుస్తాయండీ.. మాకు విషయం తక్కువ..బిల్డప్‌ ఎక్కువ కదా’ అన్నాడు. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది హేమ. ఆ మాట తను లతతో ఈయన గురించే అంది. కానీ, అది వాళ్లింట్లో. అప్పుడు మూడోమనిషి కూడా లేరు. హేమ బాగా కలవరపడింది. ఈయనకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయో అర్థం కావడంలేదు. కానీ ఓ మూడో మనిషి ఉంది. ఆ మూడోమనిషి పేరే స్టాకర్‌వేర్‌.

స్టాకర్‌వేర్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. యాప్‌ స్టోర్స్‌లో, ప్లే స్టోర్‌లో ఫోన్లలో నిక్షిప్తం చేయగల ఈ స్పై యాప్స్‌ పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. అంతేకాదు, వీటిని మన కంప్యూటర్లలో కూడా ఇన్‌స్టాల్‌ చేయవచ్చు. ఒకసారి ఇన్‌స్టాల్‌ అయిందంటే చాలు, కాల్స్‌, మెసేజ్‌లు, వాట్సప్‌లు, లొకేషన్‌..ఇలా ఆ ఫోన్‌లో ఉన్న అన్ని రకాల సమాచారాన్ని పొందొచ్చు. కొన్ని రకాల యాప్స్‌ కనబడకుండా ఉంటే, మరికొన్ని సర్వసాధారణమైన యాప్స్‌లా కనిపిస్తాయి. వాటిని మనం జనరల్‌గా పట్టించుకోము.

ఇదంతా చట్టసమ్మతంగానే జరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌లలో వీటికి అనుమతి ఉంది. కొన్ని కంపెనీలు, తన ఉద్యోగులకు స్వంత సాఫ్ట్‌వేర్‌ లోడ్‌ చేసి ఇస్తాయి. ఎక్కడ ఉన్నా, వెంటనే ఆన్‌లైన్‌లో సమస్యకు హాజరుకావడానికి వీలుగా ఇలా చేస్తాయి. అయితే కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందులో ఉంటుంది. అది లీకైతే అపారనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి,, ఆ ఫోన్ మీద నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అందుకని, ఆయా ఫోన్లలో ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ ప్రవేశపెడ్తారు. అది ఆ ఫోన్‌ వాడే ఉద్యోగికి కూడా తెలిసేవుంటుంది. ఆ సౌలభ్యం కాస్తా ఇప్పుడు జీవిత భాగస్వాములపై వాడుతున్నారు.

ప్రముఖ యాంటీవైరస్‌ సంస్థ, కాస్పర్‌స్కై చెప్పిందాని ప్రకారం, గతేడాదికి, ఇప్పటికి ఈ స్టాకర్‌వేర్‌ యాప్‌ ఇన్స్‌టలేషన్స్‌ 35 శాతం పెరిగాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికి 38వేలకు పైగా పరికరాల్లో వీటిని కనుగొన్నామని కాస్పర్‌స్కై తెలియజేసింది. అయితే ఇది సముద్రంలో నీటిబొట్టంత అని ఆ కంపెనీ ప్రధాన భద్రతా పరిశోధకుడు డేవిడ్‌ ఎమ్‌ చెపుతున్నారు. చాలామంది తమ కంప్యూటర్‌నో, లాప్‌టాప్‌నో భద్రంగా ఉంచుకుంటారు కానీ, తమ మొబైల్‌ ఫోన్‌ను మాత్రం పట్టించుకోరు. మా యాంటీ వైరస్‌ ఉన్న ఫోన్ల నుంచి వచ్చిన సంఖ్య అది. లేని ఫోన్లు ఈ ప్రపంచంలో కోట్లకోట్లు ఉన్నాయని, వాటిలో కూడా లెక్కిస్తే కోట్లలో తేల్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

స్టాకర్‌వేర్‌ను విచ్చలవిడిగా వాడుతున్న దేశాలలో రష్యా ప్రథమస్థానంలో ఉండగా, భారత్‌, బ్రెజిల్‌, అమెరికా, జర్మనీ మిగతా టాప్‌-5లో ఉన్నాయి. అయితే దీన్ని అడ్డుకోవడానికి సమర్జవవంతమైన మార్గాలు కూడా ఉన్నాయి.

బాగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే…. ఈ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలంటే, మీ ఫోన్‌ను వాళ్లు నేరుగా తీసుకుని చేయాల్సివుంటుంది. ఫోన్‌ను టచ్‌ చేయకుండా ఏమీ చేయలేరు. కొన్ని పెద్ద స్థాయి స్పైవేర్‌లు మాత్రం రిమోట్‌లో కూడా ఇన్‌స్టాల్‌ అవుతాయి. ఏ మెసేజ్‌ రూపంలోనో, మెయిల్‌లోనో వచ్చిన లింక్‌ క్లిక్‌ చేస్తే చాలు. అవి ఆటోమేటిక్‌గా ఫోన్లోకి వచ్చేస్తాయి. ఈమధ్య బాగా గొడవవుతున్న వాట్సప్‌ పెగాసస్‌ ఇలాంటిదే.

ఫొన్లో నిఘా సాఫ్ట్‌వేర్‌ ఉందని ఎప్పుడైతే అనుమానం వస్తుందో, అప్పుడు ఉన్న యాప్స్‌ అన్నింటినీ చెక్‌ చేయాలి. అనుమానాస్పదంగా ఏదైనా యాప్‌ కనబడితే వెంటనే వాటి గురించి ఆన్‌లైన్లో వెతకాలి. వాటి చరిత్ర మొత్తం బయటికొస్తుంది. వెంటనే డిలీట్‌ చేయడం చాలా మంచిది. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు వాడనిదేదైనా తీసేయడం ఉత్తమం. ఇంకొన్ని దాగివుంటాయి. వాటిని కనుక్కోవాలంటే, యాంటీవైరస్‌ స్కాన్‌ తప్పనిసరి. ఇప్పుడు దాదాపు అన్ని యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లలో యాంటీ స్పైవేర్‌ మాడ్యూల్‌ ఉంది. అసలు వీటి బారిన పడకుండ ఉండాలంటే కొన్ని నియమాలను పాటిస్తే బెటర్‌. అవి…

1. ఫోన్‌ను వదిలేసి వెళ్లొద్దు.
2. ఫోన్‌ భద్రతాప్రమాణంగా వేలిముద్రను పెట్టుకోవద్దు. మీరు నిద్రలో ఉండగా వేలిముద్ర తీసుకోవడం సులభం.
3. ఒక సమర్థవంతమైన యాంటీ-వైరస్‌ టూల్‌ను వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అప్పుడప్పుడు దాంతో స్కాన్‌ చేయాలి.

అయితే, ఈ స్టాకర్‌వేర్‌ బారిన పడ్డవారు ఒకరకమైన మనోవ్యాధికి కూడా గురవుతున్నారట. సాంకేతిక విజ్ఞానాన్ని అనుమానంగా చూడటం, ఏ రకమైన పరికరాన్ని వాడకపోవడం దీని లక్షణాలు. కొన్ని రోజుల పాటే ఈ బలహీనత ఉంటుంది. తరువాత మళ్లీ మామూలుగా మారిపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news