గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ కోసం అమ్మాయి వేషం వేసి పరీక్ష రాసిన సీన్ గుర్తుందా? మావయ్యది మొగల్తూరు అనే పాట వచ్చే సీన్. అలాంటి సీనే రియల్ లైఫ్లో జరిగింది. తన ప్రేయసి కోసం ఓ వ్యక్తి అమ్మాయిలాగా రెడీ అయి పరీక్ష రాసేందుకు వెళ్లాడు. అయితే సినిమాలో లాగా ఇక్కడ సక్సెస్ కాలేదు. బయోమెట్రిక్ వద్ద దొరికిపోయి చివరకు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ సంఘటన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో చోటుచేసుకుంది.
జనవరి 7న పంజాబ్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్స్ ..మల్టిపర్పస్ హెల్త్ వర్కర్స్ పరీక్ష నిర్వహించగా.. దీనికి పరమ్‌జీత్ కౌర్ అనే యువతి దరఖాస్తు చేసుకుంది. ఆమె స్థానంలో పరీక్ష రాసేందుకు తన బాయ్‌ఫ్రెండ్ అంగ్రేజ్ సింగ్ వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిలగా రెడీ అయి నమ్మించేందుకు ఆడవేషంలో ఉన్న తన ఫొటోలతో నకిలీ ఓటర్‌కార్డు, ఆధార్ కార్డు సృష్టించాడు. కానీ, చివరకు బయోమెట్రిక్ దగ్గర దరఖాస్తు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో మ్యాచ్ కాకపోవడంతో అనుమానం వచ్చిన యూనివర్సిటీ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. యూనివర్సిటీ అధికారులు అంగ్రేజ్ సింగ్ను పోలీసులకు అప్పగించారు.