ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి అత్యంత కీలకమైన కడప జిల్లాలో రాజకీయ పర్య టన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో టీడీపీ పరిస్థితి కకావికలంగా ఉంది. నాయకులు కనిపించడం లేదు. ఉన్నవారు కూడా పెద్దగా వాయిస్ వినిపించేసాహసం కూడా చేయడం లేదు. దీంతో కేడర్ ఇప్పటికే వెళ్లి పోయింది. ఇలాంటి పరిస్థితి ఉంటుందని, వస్తుందని చంద్రబాబు కానీ, ఆయన టీం కానీ ఎప్పుడూ ఊహించి ఉండరు. నిజానికి గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఎక్కువగా ఈ జిల్లాపై కాన్‌సంట్రేట్ చేశారు.
ఇక్కడ పార్టీని నిలబెట్టేందుకు అనేక రూపాల్లో ప్రయత్నించారు. ముఖ్యంగా రైతులకు నీటిని అందించేందుకు పట్టిసీమ జలాలను కూడా ఇక్కడ పారించారు. అదేసమ యంలో వైఎస్ కంచుకోటలో వైసీపీకి నిలువ నీడ కూడా లేకుండా చేస్తామని బీషణ ప్రతిజ్ఞలు కూడా చేశా రు. పులివెందులలో జగన్‌ను మట్టి కరిపిస్తామని ప్రతిన బూనారు. ఈ క్రమంలోనే కడప ఉక్కుకు కేంద్రం సహకరించకపోయినా.. సీఎం రమేష్‌తో నిరాహార దీక్ష చేయించి మరీ కడప ఉక్కు ఫ్యాక్టరీకి చంద్రబాబు శంకుస్థా పన కూడా చేసేశారు.
దీనివల్ల పార్టీ ఇమేజ్ పెరుగుతుందని అనుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. ఉప్పు-నిప్పుగా కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ ఆధిపత్యం చలాయించిన రామసుబ్బారెడ్డిని, ఆదినారాయణ రెడ్డిని కూడా ఒకే వేదికపైకి తెచ్చారు. ఇంత చేసినా కూడా ఈ ఏడాది ఎన్నికల్లో టీడీపీ కనీసం ఒక్కచోటంటే ఒక్క చోట కూడా పార్టీ పుంజుకున్న ది లేదు. పైగా సీఎం రమేష్, ఆది నారాయణలు పార్టీ మారి బీజేపీ గూటికి చేరిపోయారు. ఇక, మిగిలిన వారిలో చాలా మంది లోపాయికారీగా వైసీపీతో సహకరిస్తూ.. పనులు చేయించుకుంటున్నారు. కేడర్ పూర్తిగా అదృశ్యమైంది. ఓవరాల్‌గా కడప టీడీపీ అంతా వైసీపీతో ఫిక్సింగ్ మయం అయ్యింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారనేది ఇక్కడ చర్చకు దారితీస్తున్న పరిస్థితి. పైగా అత్యంత బలం ఉన్న పశ్చిమ, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లోనే పార్టీని నడిపించేందుకు నాయకులను వెతుక్కునే పరిస్థితి ఏర్పడుతున్న టీడీపీలో వైసీపీకి బలమైన కోటగా ఉన్న కడపలో ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.