వివాదం నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు.. అయోధ్య రామమందిరం టైమ్లైన్

-

అయోధ్యలో భవ్య రామమందిరం కల మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలకు ఎదురొడ్డి చివరకు అయోధ్యలో బాలరాముడి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఇంకొన్ని క్షణాల్లో నెరవేరబోతోంది. ఈ సందర్భంగా ఈ చారిత్రక స్థలంపై గతంలో జరిగిన వివాదాలు, కీలక పరిణామాలను ఓసారి గుర్తు చేసుకుందామా?

1528: మొదటి మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ వద్ద జనరల్‌ హోదాలో ఉన్న మీర్‌ బాఖి అయోధ్యలో మసీదు నిర్మించారట. శ్రీరాముడి జన్మస్థలానికి గుర్తుగా అప్పటికే అక్కడున్న ఆలయంపై దీనిని నిర్మించారనేది వాదన ఉంది.

 

1949: బాబ్రీ మసీదులో కొంతమంది ప్రజలు రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించడంతో ముస్లింల నుంచి అభ్యంతరాలు రాగా ప్రభుత్వం దీనిని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. దాంతో అప్పటి నుంచి కట్టడం తలుపులకు తాళాలు పడ్డాయి.

 

1984: ఈ స్థలానికి విముక్తి కల్పించి రామమందిరం నిర్మించాలంటూ విశ్వహిందూ పరిషత్‌ ఉద్యమాన్ని షురూ చేసింది.

 

1986 ఫిబ్రవరి 1: కట్టడం తలుపుల్ని తెరవాలని ఫైజాబాద్‌ జిల్లా జడ్జి ఆదేశించడంతో హిందువులు లోపలకు వెళ్లి పూజలు చేసుకునే వీలు ఏర్పడింది. ఈ క్మరంలో దేశంలో పలుచోట్ల మతరమైన అల్లర్లు, ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకోగా బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం ఏర్పాటైంది.

 

1989 జులై 10: ఫైజాబాద్‌ జిల్లా న్యాయస్థానంలో ఉన్న కేసులన్నింటినీ అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ ధర్మాసనానికి బదిలీ చేసింది.

 

1989 నవంబరు 9: వివాదాస్పద కట్టడానికి సమీపంలో శిలాన్యాస్‌ నిర్వహణ

 

1990: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ సోమనాథ్‌ నుంచి చేపట్టిన రథయాత్ర బిహార్‌లో నిలువరించారు.

 

1992 డిసెంబరు 6: భారీగా చేరుకున్న కరసేవకుల చేతిలో బాబ్రీ మసీదు నేలమట్టమైంది. దేశంలో అనేక ప్రాంతాల్లో మతకలహాలు చోటుచేసుకున్నాయి.

 

2003: మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) చేపట్టిన తవ్వకాల్లో వెల్లడైంది. ఈ మేరకు కోర్టు నేతృత్వంలోని తవ్వకాల తర్వాత వెల్లడైన ఈ అభిప్రాయంతో ముస్లింలు విభేదించారు.

 

2010 సెప్టెంబరు 30: వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్‌లల్లా తరఫు ప్రతినిధులకు కేటాయించాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది.2011 మే 9: మూడు భాగాలు చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

 

2019 నవంబరు 9: వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ప్రత్యామ్నాయ ప్రదేశంలో అయిదెకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డుకు ప్రభుత్వం ఇవ్వాలని తీర్పునిచ్చింది.

 

2020 ఫిబ్రవరి 5: రామాలయ నిర్మాణం, నిర్వహణకు ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర’ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

2020 ఆగస్టు 5: రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి.

 

2024 జనవరి 22: కోట్ల మంది రామభక్తులు ఎన్నో ఏళ్ల నుంచి కనులారా వీక్షించాలని మనసారా కోరుకుంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రామమందిరం ప్రారంభోత్సవ వేడుక జరిగే రోజు ఇది.

Read more RELATED
Recommended to you

Latest news