ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పద్దును సమర్పించనున్నారు. ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డ్‌ను నిర్మలా సీతారామన్ సమం చేయనున్నారు. మొరార్జీ దేశాయ్.. 1959-64 మధ్య వరుసగా ఐదు పూర్తిస్థాయి పద్దులు, ఒక మధ్యంతర బడ్జెట్ సమర్పించి.. మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు.
2019 జులై నుంచి ఇప్పటివరకు నిర్మలా సీతారామన్ ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇంతకుముందు వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశ పెట్టిన మన్మోహన్సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాను ఆమె అధిగమించనున్నారు. ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ఏప్రిల్-జులై కాలానికి నిధులు వెచ్చించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి వెసులుబాటు లభిస్తుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక 2024-25 ఆర్థిక సంవత్సరానికి జులై నెలలో పూర్తి బడ్జెట్ ప్రవేశ పెడతారు.