నకిలీ పాస్ పోర్ట్ కేసులో సిఐడి విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా ఇద్దరినీ అరెస్ట్ చేసిన అధికారులు ఇప్పటికే నకిలీ పాస్‌పోర్ట్ లపై విదేశాలకు వెళ్లిన 92 మందిని వెనక్కి రప్పించే దిశలో చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 92 మంది వివరాలను విదేశాంగ శాఖకు పంపించడంతోపాటు వీరి పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలంటూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారులకు లేఖ రాసింది.
హైదరాబాద్ చెందిన అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ జవహరి చెన్నైకి చెందిన ఏజెంట్ తో కలిసి నకిలీ ఆధారం ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఇతర ధ్రువపత్రాలు సృష్టించి శ్రీలంక దేశస్థులకు నకిలీ పాస్‌పోర్టులు తయారు చేసి ఇచ్చిన విషయం తెలిసింది. దీనికోసం కరీంనగర్ జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఏజెంట్లను కూడా పెట్టుకున్నాడు. సమాచారం తెలిసి సిఐడి అధికారులు జవహరితో పాటు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కూడా ఉన్నారు. తాజాగా ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో ఒకరు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి ఉన్నట్టు సమాచారం. జవహరిని అరెస్టు చేసిన సమయంలో సిఐడి అధికారులు 100 నకిలీ పాస్‌పోర్ట్‌లు సీజ్ చేశారు. అతడిని జరిపిన విచారణలో ఇప్పటికే 92 మంది నకిలీ పాస్‌పోర్ట్ లపై విదేశాలకు వెళ్లినట్టు తేలింది. వీరిని వెనక్కి రప్పించడానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాల్సిందిగా రీజనల్ పాస్‌పోర్ట్ అధికారులకు లేఖ రాశారు.