ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన పరిస్థితుల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన కవ్వింపు చర్యలను ఆపలేదు. క్షిపణి ప్రయోగాలతో సియోల్పై ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. ఈరోజు ఉదయం మరోసారి తూర్పు తీరం దిశగా పలు క్రూజ్ క్షిపణులు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. ఇవి తమ దేశంలోని ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్లినట్లు తెలపగా దీన్ని యూఎస్ నిఘా విభాగం కూడా ధ్రువీకరించింది.
“ఇవాళ ఉదయం తూర్పు తీరం దిశగా ఉత్తర కొరియా పలు క్రూజ్ మిసైల్స్‌ను ప్రయోగించింది. ఇవి మా దేశంలోని ప్రధాన సైనిక స్థావరంపై నుంచి వెళ్లాయి. నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉత్తర కొరియా కదలికలు గమనించేలా మా రక్షణ విభాగం అమెరికాతో కలిసి పనిచేస్తోంది.” అని దక్షిణ కొరియా (సియోల్) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనే సమాచారాన్ని మాత్రం సియోల్ వెల్లడించలేదు.