తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు.
దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు.
ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, ఫీజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.