కొన్ని రోజులుగా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకూ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కేజీ ఉల్లి రూ.100 వరకు పెట్టి కొనాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్సిడీ కేంద్రాల్లో ఒకరికి ఒక కేజీ మాత్రమే విక్రయిస్తున్నారు. దీంతో ఎక్కువమొత్తంలో కావలసిన వారు అధిక ధర వెచ్చించి కొంటున్నారు. ఉల్లిపాయ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కొత్త మార్గంలో పయనిస్తోంది, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉల్లిపాయలను రూ .75 కు కొనుగోలు చేసి, కిలోకు రూ .25 కి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోజూ 300 కుటుంబాలకు సబ్సిడీ రేట్లతో అందిస్తోన్నట్టు చెప్పారు. తాను ఉల్లిపాయలను హోల్‌సేల్ మార్కెట్ నుండి కిలోకు 75 రూపాయలకు కొనుగోలు చేసి.. వాటిని కిలోకు 25 రూపాయలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. రైతు బజార్లలో సబ్సిడీ రేట్లతో లభించే పరిమాణం వినియోగదారులకు సరిపోని కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇది చిన్న సహకారమే అయినప్పటికీ పేద వాళ్ళకోసం తనవంతు సహాయం అని గణేష్ కుమార్ అన్నారు. సబ్సిడీ ఉల్లిపాయలను కింగ్ జార్జ్ హాస్పిటల్ కు సమీపంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు ఎమ్మెల్యే .