ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం లేదా పంపిణీని నిషేధించే బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ వివరణాత్మక సమాధానం ఇచ్చిన తరువాత ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం (ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ప్రకటన) బిల్లు, 2019 ఆమోదించారు. ఇక ఈ సందర్భంగా విపక్ష సభ్యుల సవరణలను మంత్రి తిరస్కరించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే దీనిని ఆమోదిస్తున్నట్టు చెప్పారు.
చట్టం యొక్క నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ఏడాది జైలు శిక్ష తో పాటుగా… లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. దానిని పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇక దీనిపై హర్ష వర్ధన్ వివరణ ఇచ్చారు. చెడును తుడిచిపెట్టడానికి ప్రభుత్వం ఇ-సిగరెట్లను నిషేధించిందని, ఇవి హృదయనాళ వ్యవస్థ, కౌమార మెదడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మరియు క్యాన్సర్‌కు కారణమవుతాయని కేంద్ర మంత్రి హర్ష్ వర్ధన్ వివరించారు. గత కొన్నాళ్ళు గా వీటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ప్రధానంగా సిగరెట్ అలవాటు ఉన్న వారు దానిని మానడానికి గాను ఈ సిగరెట్ ని అలవాటు చేసుకుంటున్నారు. దాని కంటే ఇదే త్వరగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని వైద్యులు కూడా తెలిపిన సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వ౦ నిషేధించాలి అంటూ పలువురు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిలో ఉండే టెట్రామీథైల్పైరోజిన్ ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు అంటున్నారు. దీర్ఘకాలం పాటు తాగడం వల్ల వ్యక్తి యొక్క మెదడు మీద ప్రభావం చూపిస్తుందని… తద్వారా మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.