పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం ప్రశంసనీయమని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవి స్వాగతించారు. పీవీకి భారతరత్న ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందని అన్నారు. పీవీకి భారతరత్న తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్ధిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. ఇప్పటికీ ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలే దేశానికి దిక్సూచి అని, పార్టీలకతీతంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.
గొప్ప వ్యక్తులకు సన్మానం మన సంస్కారమని అన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించినందుకు ఆమె కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది తెలంగాణతో పాటు దేశ ప్రజలందరికీ గర్వించే క్షణం అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ వాణి దేవి. ఇక మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు భారతరత్న ప్రకటించారు. ఇటీవల ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్‌లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ప్రకటించింది. ఒకే ఏడాది ఐదుగురికి భారత అవార్డులను ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.