తెలంగాణలో ప్రతి ఇంచు మీద కేసీఆర్‌కు అవగాహన ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి అన్నారు. ఏ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలో కేసీఆర్‌కు బాగా తెలుసని పేర్కొన్నారు. నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలో కేసీఆర్‌కు తెలుసని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులు బాగు చేసుకున్నామని వెల్లడించారు. మిషన్ భగీరథ చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మంచి నీటి సమస్య పరిష్కరించారని తెలిపారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
“కొత్త ప్రాజెక్టులు చేపట్టి కొత్త ఆయకట్టుకు నీరు అందించారు. భవిష్యత్‌లో పెరిగే నీటి అవసరాల మేరకు ప్రాజెక్టులు నిర్మించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి కారణం కాంగ్రెస్ నేతలు. కేసీఆర్‌లో రాష్ట్రంలో ప్రతి ఇంచు మీద అవగాహన ఉంది. ఏ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలో, ఎక్కడి నుంచి నీటిని ఎక్కడికి తరలిస్తే రైతులకు మేలు చేకూరుతుందో బాగా తెలుసు.” – నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి