ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటివరకు దరఖాస్తులను పరిష్కరించాలంటే జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరిగా ఉండేది.. అయితే తాజాగా తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించించింది. వేగంగా భూసమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించాలని యోచిస్తోంది.
కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీవోలకు బదిలీ చేయాలని రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనికోసం జీవో జారీ చేయాలా లేదా సర్క్యులర్ ద్వారా చర్యలు చేపట్టాలా అన్న అంశంపై నిపుణులు సమాలోచన చేస్తున్నారు. ధరణి కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట పెండింగ్ సమస్యలతో ప్రారంభించి.. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ధరణి దరఖాస్తుల్లో చిన్న తప్పున్నా, ఆధారాలు లేకపోయినా తిరస్కరించిన దాఖలాలు కోకొల్లలు. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన క్రమంలో తిరస్కరించిన దరఖాస్తుల్లోనూ అర్హత ఉన్నవాటికి మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు.