ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని చెప్పారు. వివిధ పథకాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విబాగంలో ఏళ్లకేళ్లుగా పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
పాడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ఒక్కో లీటర్‌పై ఇచ్చే రూ.4 ప్రోత్సాహకం మూడేండ్లుగా ఇవ్వటం లేదని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకు వచ్చారు. దాదాపు రూ.203 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్… ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాకాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడాలని చెప్పారు.