గత కొన్ని రోజులు ఉల్లి ధరలు కొయ్యకుండానే కనీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఉల్లిపాయలు తినడమే మానేశారు. అయితే ఉల్లి ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజల ఉల్లి కష్టాలు తీర్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలకు రిలీఫ్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ధరలు తగ్గే వరకు రైతు బజార్లలో రూ.25కే కిలో ఉల్లిని విక్రయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
రైతు బజార్లలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు జరపాలన్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతీ రోజూ రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు చేపట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయాలని చెప్పారు. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. కాగా, గడిచిన 18 రోజుల్లో 16వేల క్వింటాళ్ల ఉల్లిని జగన్ ప్రభుత్వం సరఫరా చేసింది. 18 రోజుల్లో రూ.9.50 కోట్ల ఖర్చుతో ఉల్లిని కొనుగోలు చేసింది. దీంతో ప్రభుత్వంపై రూ.5.83 కోట్ల ఆర్థిక భారం పడింది. అయితే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా ఇబ్బంది లేదని సీఎం జగన్ చెప్పారు.