కృష్ణా జిల్లా గన్నవరం నుంచి వరుస విజయాలు సాధించిన టీడీపీ నాయకుడు వల్లభనేని వంశీ త్వరలోనే ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరిస్తారు? ఏ పార్టీ తరఫున ఆయన వకాల్తా పుచ్చు కుంటారు? ప‌్రస్తుతం ట్రెజరీ బెంచీలు, ప్రతిపక్ష బెంచీలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆయన ఎటు వైపు కూర్చుంటారు? ఏం చేస్తారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. ఆయన ఇటీవల తను గెలిచిన టీడీపీకి రాజీనామా సమర్పించారు. అదేసమయంలో అధికార పార్టీ వైసీపీకి జై కొట్టారు.
కానీ, ఆయన టీడీపీకి రాజీనామా చేసినా.. వైసీపీకి జై కొట్టి.. జగన్‌ను కొనియాడినా.. టెక్నికల్‌గా మాత్రం .. వంశీ ఇప్పటికీ.. టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. టీడీపీ టికెట్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి ఆయన రిజై న్ చేయలేదు. దీంతో ఆయన అసెంబ్లీ లెక్కల ప్రకారం..టీడీపీ అభ్యర్థిగానే పరిగణించబడతారు. ఈ నేప థ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఎటువైపు కూర్చుంటారనే ప్రశ్న సహజంగానే వినిపిస్తుంది.
దీనిపై గన్నవరం నియోజకవర్గంలోనూ చర్చ సాగుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎయిర్ పోర్టు భూముల సమీకరణకు సంబంధించి రైతులకు న్యాయం జరగాల్సి ఉంది. చెరకు రైతులకు ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అదేసమయంలో గన్నవరం అభివృద్దికి ప్రబుత్వం నుంచి నిధులు అందాల్సి ఉంది. మరి వీటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక, సమాధానాలు రాబట్టే వేదిక అసెంబ్లీ ఒక్కటే.
అయితే, ఇప్పుడు వంశీ పార్టీ మారిన నేపథ్యంలో ఆయన ఎటు వైపు కూర్చుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ? అనే ప్రశ్న వస్తోంది. పోనీ సభలకు వెళ్లకుండా డుమ్మా కొట్టాలన్నా.. వరుసగా మూడోసారి కూడా సభలకు హాజరు కాకపోతే.. నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపత్యంలో తటస్థంగా సభలో ఓ మూలకు కూర్చుంటారా? లేక టీడీపీ బెంచీల్లోనే కూర్చుంటారా? అనేది ఆసక్తిగా మారింది.