అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు మార్చి 17తో 100 రోజులు పూర్తి అవుతాయని.. ఆ లోపు స్కీమ్ లను అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. మార్చి 17 వరకు ఓపిక పడతామని.. ఆ తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే ప్రజా బాట పడతామని కాంగ్రెస్ సర్కార్కు డెడ్ లైన్ విధించారు. ఆదివారం కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ని గెలిపించి కేసీఆర్ నేతృత్వంలోని మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని అన్నారు. మళ్లీ కొద్ది రోజుల్లో వెలుగులోకి వస్తామని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డిలో బీఆర్ఎస్ ఓటమి తీవ్ర నిరాశ మిగిల్చిందని, అసంబద్ధమైన హామీలిచ్చి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించారన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తేదీన రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు అయ్యింది.. మరీ రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.