హైదరాబాద్ శివారులో శంషాబాద్ సమీపంలో పశు వైద్యురాలు ‘దిశ’ ను అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ కేసులో నిందితుల దారుణాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు దిశను హతమార్చిన తరువాతే పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. కాని ఆమెను బతికుండగానే కాల్చి వేసినట్లు ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా అలియాస్ ఆరిఫ్ జైల్లో ని కొందరు కిందిస్థాయి సిబ్బందికి చెప్పినట్లు తెలిసింది. నేరం జరిగిన రోజున ఆరిఫ్ సహా మరో ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకుని సమీప ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే హెల్ప్ హెల్ప్ అంటూ ఆమె పెద్దగా కేకలు వేసింది.
అవి ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో చెన్నకేశవులు వెంటనే జేబులోని మద్యం తీసి బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. అప్పటికే భయంతో ఆందోళనతో ఉన్న ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే నలుగురు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఒకవైపు మద్యం తాగించడం, మరోవైపు పాశవికంగా అత్యాచారానికి గురవడంతో ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె చనిపోయినట్లుగా భావించి చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి ఆ స్థితిలోనే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ విషయం కేసు కీలక నిందితుడు ఆరిఫ్ జైలు జవాన్లకు చెప్పినట్లు సమాచారం.