బ్రెజిల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కరవు కారణంగా చెలరేగిన దావాగ్ని అమెజాన్ అడవిని కాల్చేస్తోంది. దాదాపు 60 శాతం అమెజాన్ అడవులు కలిగిన దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో కార్చిచ్చుల వల్ల వేలాది ఎకరాల్లో అమెజాన్ అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అవుతోంది. తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటం వల్ల అక్కడి వృక్ష, జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దావానలం తీవ్రత రొరైమా రాష్ట్రంలో అధికంగా ఉంది.
బ్రెజిల్ భూ భాగంలో రొరైమా కేవలం 2.6 శాతమే అయినప్పటికీ అక్కడ ఫిబ్రవరి నెలలో ఏకంగా 2,057 కార్చిచ్చులు చెలరేగాయి. రొరైమాలో అటవీ మంటలు జనావాసాలకు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు అధికారులు 600 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మరో 240 మంది అగ్నిమాపక సిబ్బందిని అందులో చేర్చుకున్నారు. అయితే సరిపడా హెలికాప్టర్లు లేకపోవడం వల్ల మంటల్ని అదుపు చేయడం కష్టతరంగా మారిందని గవర్నర్ ఆంటోనియో తెలిపారు. దీనిపై బ్రెజిల్ ప్రభుత్వానికి సాయం కోరినట్టు చెప్పారు.