ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కవిత. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో ‘‘మా అమ్మను కలిసేందుకు అనుమతించండి’’ అంటూ న్యాయస్థానాన్ని కవిత అభ్యర్థించారు. తల్లితో పాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
అయితే తాజాగా కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. దీనికి జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతించినట్లు చెప్పారు. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని న్యాయవాది విక్రమ్ వెల్లడించారు.