పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. 400 లకు పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జనశక్తి ప్రెసిడెంట్ పశుపతి కుమార్ పరాస్ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీయే కోసం నిజాయితీగా పనిచేసినా తమకు పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా నిర్వహించిన ఆయన.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వైదొలుగుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కాగా, ఎన్డీయే కూటమి నిన్న బిహార్ లో సీట్ల షేరింగ్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుండగా, నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్డీయే మరో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనుంది. హిందుస్థానీ అవామ్ మోర్చా రాష్ట్రీయ లోకమోర్చా చెరో స్థానంలోనూ పోటీ చేయనున్నాయి. అయితే, ఎన్డీయేలో ఉన్నప్పటికీ పశుపతి సారథ్యం వహిస్తున్న RLJPకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో ఆయన రాజీనామాతో పాటు ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు.