2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్య రాజ్య సమితి తెలిపింది. అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ఒక దశాబ్దాన్ని 2023 పూర్తి చేసిందని పేర్కొంది. ఈ దశాబ్ద కాలంలో హిమనీనదాలు కరగడం, సముద్రాల్లో నీరు వేడెక్కడం, అంటార్కిటికాలో మంచు కరిగిపోవడం వంటివి రికార్డు స్థాయిలో నమోదయినట్లు ఐరాస ప్రపంచ వాతావరణ విభాగం వార్షిక నివేదికలో వెల్లడించింది.
2023 సంవత్సరం ఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడి గల సంవత్సరంగా పేర్కొంది. అలాగే ఆ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రత ఉన్న దశాబ్దంగా తేల్చింది. ప్రపంచం ప్రమాదపు అంచున ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేసింది. శిలాజ ఇంధన వినియోగం పెరుగుదలే దీనికి కారణమని, వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్నాయనీ ఈ భూగ్రహం మనకు ఒక విపత్తు సందేశాన్ని పంపుతోందని ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. గతేడాది సగటు ఉపరితల ఉష్ణోగ్రత 1.45 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉందనీ ఇది ప్రమాదకరంగా భావిస్తున్న 1.5 డిగ్రీల సెల్సియస్‌కు అతి చేరువలో ఉందని డబ్ల్యూఎంవో నివేదిక తెలిపింది.