బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫైటర్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు శుభవార్త. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 20వ తేదీ రాత్రి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సడెన్‌గా ప్రకటించడంతో యాక్షన్ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీవ్ జైశ్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఫైటర్ స్టోరీ ఏంటంటే : సంషేర్ పఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోషన్) భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్. సాహసాలకి వెనకాడని ఫైటర్ పైలట్. అప్పజెప్పిన బాధ్యతల్ని నిర్వర్తించే క్రమంలో తనకున్న పరిధుల్ని, నిబంధనల్ని దాటి మరీ సాహసాలు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే జరిగిన ఓ దుస్సంఘటనకి బాధ్యుడిగా నిందని మోస్తూ ఉంటాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఓ ఆపరేషన్ కోసం శ్రీనగర్ వస్తాడు. సీవో రాకీ (అనిల్ కపూర్) నేతృత్వంలో మిన్ను అలియాస్ మినల్ సింగ్ రాఠోడ్ (దీపికా పదుకొణె), తాజ్ (కరణ్ సింగ్ గ్రోవర్), బాష్ (అక్షయ్ ఒబెరాయ్) బృందం రంగంలోకి దిగుతుంది. గగనతలంలో శత్రువులపై వాళ్ల పోరాటం ఎలా సాగింది? రెండేళ్ల కిందట జరిగిన ఆ సంఘటన ఏమిటి? తనకు ఎదురైన సవాళ్లని దాటి పాటీ నిజమైన ఫైటర్ అని ఎలా చాటుకున్నాడు? అనేదే కథ.