దేశంలో ప్రసిద్ధి గాంచిన ‘బటర్ చికెన్’, ‘దాల్ మఖానీ’ వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై గతకొద్ది రోజులుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తమ పూర్వీకుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్.. ‘బటర్ చికెన్’, ‘దాల్ మఖానీ’ వంటకాలను కనుగొన్నారని, అయితే ఆ రెండు వంటకాలపై దర్యాగంజ్.. పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోతీ మహల్ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశంలో వివాదం మొదలైంది. అయితే ఇప్పుడు ఈ బటర్ చికెన్ న్యాయవివాదం మరింత ముదురింది.
దిల్లీకి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వార్తాపత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో ‘బటర్ చికెన్’ మూలంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్‌సైట్లలోనూ రావడంతో తమ రెస్టారెంట్ గౌరవానికి భంగం కలిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ మోదీ మహల్ యజమానులను జస్టిస్ సంజీవ్ నరులా ఆదేశించారు.